శ్రీ కార్తీక పురాణము 7వ అధ్యాయము

 శ్రీ కార్తీక పురాణము 7 అధ్యాయము


ఏడవ రోజు పారాయణము

 #శివకేశవార్చన_విధులు.

వసిష్ఠ మహాముని ఇలా చెబుతున్నారు. ఓ జనక మహారాజా! విను.
కార్తీకమహాత్మ్యమును ఇంకా వివరిస్తాను. ప్రసన్న చిత్తుడవై విను. 
#కార్తీకమాసము లో ఎవరు కమలముల చేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీ హరిని పూజిస్తారో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యమూ నివాసముంటుంది.

ఈ మాసములో భక్తితో తులసీదళములతోనూ, జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాగ, చంపక ఇత్యాదులతోనూ శ్రీ హరిని పూజించువాడు తిరిగి భూమిమీద జన్మించడు. ఈ మాసమున మారేడుదళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి ఈ భూమిమీద జన్మించడు.
కార్తీక మాసములో భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశిస్తాయి. ఉసిరిక కాయలతో ఉన్న ఉసిరి చెట్టు క్రింద శ్రీ హరిని పూజించు వానిని యముడు కన్నెత్తి చూసే సాహసమైనా చేయజాలడు.

కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును, దానిలో సందేహమేలేదు. కార్తికమాసలో బ్రాహ్మణులతో కూడా వనభోజన మాచరించు వాని మహాపాతకములన్నీ నశిస్తాయి. బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపద మొందగలడు.

కార్తీకమాసము లో భక్తితో శ్రీ హరి ఆలయములో మామిడి ఆకులతో తోరణము కట్టిన వానికి మోక్షము దొరుకుతుంది. శ్రీ హరికి అరటి స్తంభములతో గానీ, పువ్వులతో గానీ మంటపాన్ని నిర్మించి, పూజించిన వానికి వైకుంఠములో చిరకాల వాసము కలుగుతుంది. ఈ కార్తీక మాసములో ఒక్కసారైనా హరి ముందు సాష్ఠాంగ ప్రమాణము చేసిన వారు పాపముక్తులై అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలరు.

హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి వెళ్ళగలరు. ఈ మాసము స్నానము చేసి, తడిబట్టలతో ఉన్నవానికి వస్త్రదానము చేసిన వాడు పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలాన్ని పొందుతాడు.

కార్తీకమాసము లో విష్ణువుయొక్క ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి లాగా నశించి పోతాయి. ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసిపువ్వులతో శ్రీ హరిని పూజిస్తే పదివేల యజ్ఞములు చేసిన ఫలము లభిస్తుంది. ఈ మాసములో బృందావనముని ఆవు పేడతో అలికి, రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీ హరికి ప్రియురాలు కాగలదు.

కార్తీక మాసమున విష్ణుభగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫలాన్నీ వర్ణించడం బ్రహ్మకు కూడా శక్యము కాదు. (నందా దీపము అంటే, ప్రతిపత్తిథి, షష్ఠీ తిథి, ఏకాదశీ తిథులలో సమర్పించే దీపము). ఈ నందాదీపము ఆచరించని వారు వ్రతభ్రష్టులనిపించుకుంటారు. కాబట్టి నువ్వులతో, ధాన్యముతో, అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీ హరికి సమర్పించాలి. కార్తీక మాసములో శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు.

కార్తీక మందు విష్ణ్వాలయములోని మంటపంను భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందగలరు. ఈ మాసములో మల్లెపూవులతో శ్రీ హరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకట్లలాగా నశిస్తాయి. తులసీ గంధముతో సాలగ్రామమును పూజించిన వాని పాపములు దద్గమై విష్ణులోకాన్ని చేరగలడు.

హరి సన్నిధిలో స్త్రీగానీ, పురుషుడుగానీ నాట్యము చేసినట్టయితే, పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడ నశిస్తాయి. ఈ మాసంలో భక్తితో అన్నదానమాచరించువాని పాపములు గాలికి కొట్టుకుపోయిన మబ్బులలాగా తేలిపోతాయి.

కార్తీక మాసములో తిలాదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము అనే నాలుగు ధర్మములు ఆచరించాలి. ఈ మాసములో దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరవాత చండాలుడవుతాడు. స్త్రీగానీ, పురుషుడుగానీ కార్తీక వ్రతమాచరించనివాడు గాడిదగా ముందు జన్మించి తరవాత నూరు మార్లు కుక్కగా జన్మిస్తాడు.

కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీ హరిని పూజించిన వారు సూర్య మండలమును దాటి స్వర్గలోకమునకు చేరుకుంటారు. మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడుజన్మలు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మిస్తాడు. ఈ మాసములో పద్మములతో శ్రీ హరిని పూజించిన వారు సూర్యమండలమందు చిరకాలవాసి కాగలడు. అవిసెపువ్వుల మాలను ధరించి శ్రీ హరినీ అవిసెపువ్వుల మాలికలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు.

స్త్రీలు మాలల చేత కానీ తులసీదళాల చేత కానీ ఈ మాసమందులో హరిని పూజించినట్టయితే పాపవిముక్తులై వైకుంఠమును పొందుతారు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసినట్టయితే, మాసమంతా స్నానమాచరించిన పుణ్యము కలుగుతుంది.

ఈ మాసములో శుక్ల ప్రతిపత్తిథినాడు, పూర్ణిమనాడు అమావాస్యనాడు ప్రాతఃస్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు. అందుకు కూడా శక్తిలేని వారు కార్తీక మాసములో నెలరోజులూ కార్తీక మాహాత్మ్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశిస్తాయి

ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందే వారి పాపములు కూడా ఏ సందేహము లేకుండా నశించిపోతాయి. ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందుతాడు. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించిన వాడు వైకుంఠాన్ని చేరుకుంటాడు .

ఇతి స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, ఏడవ అధ్యాయము - ఏడవ రోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి.


|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Click Below & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Karnati Vanitha Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP


Comments

Popular posts from this blog

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

Vasthu Tip (వాస్తు టిప్) 005

శ్రీ కేదారేశ్వర వ్రత కథ