శ్రీ కార్తీక పురాణము 23వ అధ్యాయము

                                          శ్రీ కార్తీక పురాణము 23 అధ్యాయము


 #శ్రీరంగక్షేత్రమున_పురంజయుడు_ముక్తినొందుట

అగస్త్య ముని పల్కెను. అత్రి మునీంద్రా! పురంజయుడు యుద్దమందు జయమొందిన తర్వాత ఏమి చేసెనో నాకు దెలియజెప్పుము. అత్రి పల్కెను. శత్రు బాధారహితమైన అయోధ్యా పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు, సదాశుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడును, సూర్యుడు వలె చూడ శక్యముగాని వాడును, శత్రువులను శిక్షించు వాడును, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామక్రోధలోభ మోహ మద మాత్సర్యములను జయించిన వాడును, కార్తిక వ్రతము చేత పాపములన్నియు నశింపజేసి కొనిన వాడై యుండెను.

ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లారాధింతును? ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును? ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి యిట్లనియె. ఓ పురంజయా! శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది. అచ్చట శ్రీరంగనాథుడు వసించి యున్నాడు. కాబట్టి సంసారచ్చేదమును జేయువాడగు శ్రీరంగ నిలయుని సేవిన్చుమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్యా పట్టణమును విడిచి తన చతురంగ బలములతోను అనేక క్షేత్రములను తీర్థములను జూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను. 
#కార్తికమాస మంతయు అచ్చట ఉంది కావేరీ మధ్యము, నివాసముగా గలవాడిన శేష శాయియయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తిక వ్రతమును శాస్త్రోక్తముగా జేసెను. కృష్ణా, కృష్ణాయని గానము చేయుచు గోవిందా, వాసుదేవా యని నిరంతరమూ కీర్తించుచు, విష్ణు పూజా పరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషశాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను.

మధ్యనున్న దేశములను జూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్యా పట్టణమును జూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోను, పుష్టితోను గూడిన జనులు గలిగినదియు, దృఢముగా నున్న యంత్రములు గడియలు గలిగినదియు అగడ్తలు గలిగినదియు, గుర్రములతోను, ఏనుగులతోను, రథములతోను నిండియున్నదియు, గృహ గోపురముల వెంట వీధులు గలిగినదియు, అనేక వర్ణములు గల పతాకములు గలదియు, వాయువుచేత చలింప జేయబడుచున్న పతాకములు గలదియు, అనేక భటులు కలదియు అనేక దేశ వాసులతో గూడినదై యుండెను. అచ్చట స్త్రీలు సుందరులును, హంసల వలే, ఏనుగుల వలె నడుచు వారును, చెవుల వరకునుండు విశాల నేత్రములు గలవారును, గొప్ప పిరుదులు గలవారును, సన్నని నడుము గలవారును, బలిసిలావుగా వున్న కుచములు గలవారును, మంచి వస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితలుగా నుండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు, నృత్యమందు నిపుణులును, సౌందర్యముతోను, లావణ్యముతోను గూడియున్న వారును, నిత్యమానంద యుక్తులు, మదోన్మత్తులును సమస్త స్త్రీ గుణ భూషితలై చూచుటలోను, మాట్లాడుట లోను బహు నేర్పరులై సభలలోను రాజమార్గముల లోను రచ్చలలోను ఆటలాడుచుండువారి యుండిరి.
అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితలై పాతివ్రత్య పరాయణలై యుండిరి.

ఓ అగస్త్య మునీంద్రా అచ్చటి మనుజులందరు తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును జూచి సంతోషించెను. "యధారాజా తథా ప్రజా" అను న్యాయమును బట్టి రాజు న్యాయ వర్తనుడైన ప్రజలును న్యాయమందే యుందురు గదా! పురజనులందరును రాజు వచ్చుటను విని వేలవేలు గూడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును బ్రవేశించి తన యింటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మ యుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములననుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమమవలంబించి కార్తి వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దానిచేత వైకుంఠ లోక వాసియై సుఖముగా నుండెను.

అగస్త్య మునీంద్రా! కార్తిక వ్రతము మహా మహిమ గలది. ఈ కార్తిక ధర్మము హరికి ప్రియకరము. కార్తిక వ్రతమును జేయువాడు పరమ పదమును బొందును. అవశమై చేసినను ఉత్తమగతి పొందును. సమస్త సౌఖ్యములను యిచ్చునదియు, కలికల్మష నాశకారియు నైన కార్తిక వ్రతమును జేయని మనుష్యుడు దుఃఖమును బొందును. హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసికొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును.

ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మాహాత్మ్యే త్రయోవింశాధ్యాయ సమాప్తః!!

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి


|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Click Below & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Karnati Vanitha Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP


 

Comments

Popular posts from this blog

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

Vasthu Tip (వాస్తు టిప్) 005

శ్రీ కేదారేశ్వర వ్రత కథ