శ్రీ కార్తీక పురాణము 19వ అధ్యాయము
శ్రీ కార్తీక పురాణము 19వ అధ్యాయము
◆ #చతుర్మాస్య_వ్రత_ప్రభావనిరూపణ.
జ్ఞాన సిద్ధుడిట్లు స్తుతిజేసెను. వేదవేత్తలు మిమ్ము
వేదవేద్యునిగాను, వేదాంతములందు
ప్రతిపాదింబపడిన వానిని గాను, గుహ్యమైనవాని గాను, నిశ్చలునిగాను, అద్వితీయునిగాను, తెలుసు కొనుచున్నారు. చంద్ర, సూర్య, శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీపాదపద్మములము
నమస్కరించుచున్నాము.
వాక్యములతో చెప్ప శక్యముగాని వాడవు. శివునిచే
పూజించు పాదపద్మములు కలవాడవు. సంసార భయమును తీసివేయు సమర్ధుడవు. జన్మసంసార
సముద్రమునందున్న శివాదులచేత నిత్యము కొనియాడబడు వాడవు. చరాచర ప్రాణులచే
స్తుతింపబడినవాడవు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు నీ విభూతి
విస్తారమే. పరముకంటే పరుడవు. నీవే ఈశ్వరుడవు.
ఈ చరాచరరూపమైన ప్రపంచమంతయు దానికి కారణమైన మాయతో
కూడా నీయందు తోచుచున్నది. త్రాడు నందు పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతివలె
తోచుచున్నది అనగా లేదని భావము.
ఓ కృష్ణా! నీవు ఆదిమధ్యాంతములందు ప్రపంచమందంతటను
ఉన్నావు. భక్ష్య, భోజ్య,
చోష్య, రూప చతుర్విధ అన్నరూపుడవు నీవే.
యజ్ఞరూపుడవు నీవే. నీసంబంధియు, పరమ సుఖప్రదమును అయిన
సచ్చిదానంద స్వరూపమును చూచిన తరువాత ఈ జగము వెన్నెలయందు సముద్రమువలె తోచును. ఆనంద
సముద్రము నీవే. నీవే ఈశ్వరుడవు. నీవే జ్ఞాన స్వరూపుడవు. సమస్తమునకు నీవే ఆధారము.
సమస్త పురాణ సారము నీవే అగుదువు. నీవలననే సమస్తము జనించును. నీయందే లయించును. నీవు
ప్రాణుల హృదయమందుండు వాడవు. ఆత్మ స్వరూపుడవు. అఖిలవంద్యుడవు. మనస్సు చేతను చూడ
శక్యముగాని నీవు మాంసమయములైన నేత్రములకెట్లు గోచరమగుదువు? ఓ
కృష్ణా! నీకు నమస్కారము. ఓ ఈశ్వరా! నీకు నమస్కారము. ఓ నారాయణా! నీకు నమస్కారము.
నన్ను ధన్యునిచేయుము. మీదర్శనఫలము విఫలము చేయకుము. ఓ పరమపురుషా! నీకు మాటిమాటికీ
నమస్కారము. ఓదేవేశా! నన్ను నిరంతరము పాలించుము.
సమస్త లోకములందు పూజించదగిన నీకు నేను మ్రొక్కెదను.
ఇందువలన నా జన్మ సఫలమగుగాక. నీకేమియు కొరతపడదు గదా! నీ జ్ఞానానికి లోపము ఉండదు
గదా! నీవు దాతవు. కృపా సముద్రుడవు. నేను సంసారసముద్రమగ్నుడనై దుఃఖించుచున్నాను.
కాబట్టి సంసార సముద్రమునందు పడియున్న నన్ను రక్షించుము. శుద్ధ చరితా, ముకుందా! దుఃఖితుడనగు నన్ను రక్షింపుము.
త్రిలోకనాథా నమస్కారము. త్రిలోకవాసీ నమస్కారము. అనంతా, ఆదికారణా,
పరమాత్మా నమస్కారము. పరమాత్మరూపుడవు, పరమహంస
పతివి, పూర్ణాత్ముడవు. గుణాతీతువు, గురుడవు,
కృపావంతుడవు. కృష్ణా నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్ధిని వాసివి,
స్వర్గమోక్షప్రదుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధు హృదయ పద్మనివాసివి, ఆత్మరూపుడవు, దేవేశుడవు అయిన ఓ కృష్ణా! నీకు
నమస్కారము.
ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా! నీకు
నమస్కారము. వైకుంఠనిలయా! వ్యాసాదులచేత కొనియాడబడు పాదములు గల కృష్ణా! నీకు
నమస్కారము. విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్తియను పడవచేత
సంసారసముద్రమును దాటి తేజోమయమైన నీరూపమును పొందుదురు. అనేక బోధలచేతను, తర్కవాక్యములచేతను, పురాణములచేతను, శాస్త్రములచేతను, నీతులచేతను మనుష్యులు నిన్ను చూడలేదు. నీపాదభక్తి యను కాటుకను ధరించి
నీరూపమును చూచి దానినే ఆత్మగా భావించి తరింతురు. గజేంద్ర, ధృవ,
ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ,
ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓహరీ! నీకు నమస్కారము.
నీ నామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించుట
ఆశ్చర్యము. ఒక్కమారు నీనామ సంకీర్తన చేయువాడు నీపదసన్నిధికి చేరును. కేశవా, నారాయణా, గోవిందా,
విష్ణూ, జిష్ణూ, మధుసూదనా,
దేవా, మహేశా, మహాత్మా,
త్రివిక్రమా, నిత్యరూపా, వామనా శ్రీధరా, హషీకేశా, పద్మనాభా,
దామోదరా, సంకర్షణా! నీకు వందనములు. ఓ
కృపానిధీ! మమ్ములను రక్షించుము. ఇట్లు స్తుతిచేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు
చిరునవ్వుతో ఓ జ్ఞానసిద్ధా! నీస్తోత్రమునకు సంతోషించితిని.నామనస్సు నీ స్తోత్రముతో
ప్రసన్నమైనది. వరమిచ్చెదను. కోరుకొనుమని విష్ణువు పల్కెను.
జ్ఞానసిద్ధుడు,
గోవిందా! నాయందు దయయున్న యెడల నీస్థానమును ఇమ్ము. ఇంతకంటే వేరు ఏ
ఇతర వరము కోరను.భగవంతుడిట్లు చెప్పెను.ఓ!జ్ఞానసిద్ధా! నీవు కోరినట్లగును.కాని
ఇంకొకమాట చెప్పెదను వినుము. లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు. బుద్ధిహీనులయి
ఉన్నారు. వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగెడి ఉపాయమును చెప్పెదను వినుము.
ఓ మునీంద్రులారా! మీరందరు వినుడు నే చెప్పు మాట
ప్రాణులకు సుఖదాయకము.
నేను #ఆషాఢశుక్ల_దశమినాడు లక్ష్మితో గూడ సముద్రమందు నిద్రించెదను. తిరిగి
కార్తీక #శుక్ల_ద్వాదశినాడు మేల్కొనెదను.
కాబట్టి నాకు నిద్రా సుఖము ఇచ్చెడి ఈమాస చతుష్టయమునందు శక్తివంచన చేయక
వ్రతాదులనాచరించువారికి పాపములు నశించును.నా సన్నిధియు కల్గును. నాకు నిద్రాసుఖప్రదమైన
ఈమాస చతుష్టయమందు వ్రతమాచరించని వాడు నరకమందు పడును. ఓ మునీశ్వరులారా!నా ఆజ్ఞమీద
భక్తిమంతులైన మీరు ఇష్టార్థదాయకమయిన ఈవ్రతమును తప్పక చేయండి. ఇంకా అనేకమాటలతో నేమి
పనియున్నది? ఎవ్వడు మూఢుడై ఈచాతుర్మాస్య వ్రతమును
చేయడో వాడు బ్రహ్మహత్య ఫలమును పొందును.
నాకు నిద్రగాని,
మాంద్యముగాని, జాడ్యముగాని, దుఃఖముగాని, జన్మజరాదులు గాని, లాభాలాభములు గాని లేవు. అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రమునందు
శయనించలేదు. నా భక్తి గల వారెవ్వరో భక్తి లేనివారెవ్వరో పరీక్షించి చూతమని
నిద్రయను వంకపెట్టుకుని శయనించెదను.
కాబట్టి, నా ఆజ్ఞననసరించి నాకిష్టమయిన ఈచాతుర్మాస్య వ్రతమును చేయువారు నాకు
ఇష్టులగుదురు. నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠించువారికి నా
భక్తి స్థిరమై అంతమందు నాలోకమును చేరి సుఖింతురు.హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా
ఆషాఢశుద్ధ దశమినాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు
శయనించెను.
అంగీరసుడిట్లు పలికెను. ఓయీ! నీవడిగిన ప్రశ్నకు
సమాధానముగా ఈ చాతుర్మాస్య వ్రతము సర్వ ఫలప్రదము అన్ని వ్రతములలోను
ఉత్తమోత్తమమైనది. పాపవంతులుగాని, దురాత్ములు గాని, సాధువులు గాని, ఎవరైనను హరిపరాయణులై ఈ నాలుగు మాసాలు చాతుర్మాస్య వ్రతమును చేయవలెను.
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు,
శూద్రులు, స్త్రీలు, యతులు,
ఇతరులు అందరును ఈ వ్రతమును విష్ణుప్రీతికొరకై చేయవలెను. ఈ
చాతుర్మాస్యవ్రతమును పునిస్త్రీగాని, విధవ గాని, శ్రమణిగాని, లేక సన్యాసిని గాని తప్పకచేయవలెను.
మోహముచేత చాతుర్మాస్య వ్రతమును చేయని యెడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపములు
పొందును.
మనోవాక్కాయములను శుద్ధము చేసికొని చాతుర్మాస్యమునందు
హరిని పూజించువాడు ధన్యుడగును. చాతుర్మాస్య వ్రతమాచరించని వాడు కోటి జన్మములందు
కల్లుద్రాగువాడు పొందెడి గతిని పొందును అనుటలో సందేహము లేదు. చాతుర్మాస్య
వ్రతమాచరించని వాడు గోహత్య చేసిన వాని ఫలమును పొందును.
ఈ ప్రకారముగా వీలు చేసికొని ఏవిధముగానైనను
చాతుర్మాస్య వ్రతమాచరించు వాడు నూరు యజ్ఞములఫలమొంది అంతమందు విష్ణులోకమును చేరును.
జ్ఞానసిద్ధాదులిట్లు హరియొక్క మాటలను విని చాతుర్మాస్య వ్రతమును చేసి వైకుంఠలోక
నివాసులయిరి.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే
ఏకోనవింశాధ్యాయసమాప్తః
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి
For Updates Click Below & Join
ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies
ఫేస్ బుక్ పేజీ Vasthu House
ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha
వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం
ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?


Comments
Post a Comment