శ్రీ కార్తీక పురాణము 17వ అధ్యాయము

                                          శ్రీ కార్తీక పురాణము 17 అధ్యాయము


#అంగీరసుడు_ధనలోభునకు_చేసిన_తత్త్వోపదేశము

అంగీరసుడు ఈ విధముగా చెప్పసాగెను.

"ఓయీ! కర్మబంధముక్తులు, కార్య కారణములు. స్థూల, సూక్ష్మములు, ఈజంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాసపర్వతమున పార్వతికి శంకరుడు చెప్పిన దానిని ఇప్పుడు నీకు నేను చెప్పెదను. ఇతర చింతను మాని వినుము.

జీవుడనగా వేరెవ్వడును లేడు. నీవే జీవుడవు. నేను ఎవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను. ఇందుకు సందేహము లేదు. దేహమనెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము" అని ఆ అద్భుత పురుషునితో పలికెను.

ఆ అద్భుతపురుషుడు, "మునీశ్వరా! మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు కలుగలేదు. అహంబ్రహ్మేతి (నేను బ్రహ్మనను) వాక్యార్థమును ఎట్లు తెలిసికొనగలను. ఈ వాక్యార్థ బోధకు హేతువయిన పదార్థజ్ఞానము నాకు తెలియలేదు. కాబట్టి విమర్శగా చెప్పగోరెదను" అని అడుగగా, ఆంగీరసముని ఇట్లు చెప్పెను.

"ఆత్మ అంతఃకరణమునకు, తద్వ్యాపారములకు సాక్షియు, చైతన్య రూపియు, ఆనందరూపియు, సత్య స్వరూపమై ఉన్నది. ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనుట లేదు?సచ్చిదానంద స్వరూపుడును, బుద్ధికి సాక్షియునయిన వస్తువునే ఆత్మగా తెలిసికొనుము. ఈ దేహమనెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. దేహము ఘటమువలే రూపము గల్గిన పిండము గనుక ఇది ఆత్మగాదు. ఇదిగాక ఈదేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలనబుట్టినది. గనుక దేహము వికారము కలది ఆత్మగాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని తెలిసికొనుము. అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు, ఆత్మవస్తువులు కావు. దేహేంద్రియాదులన్నియు ఎవరి సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనని = ఆత్మయని తెలిసికొనుమని భావము. లోపలికి మలచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుముకు అయస్కాంతమణి వలె తాను వికారిగాక బుద్ధ్యాదులను చలింపజేయునది ఏది కలదో అది నేను = ఆ బ్రహ్మనని తెలిసికొనుము".

"ఎవనియొక్క సాన్నిధ్య మాత్రముచేత జడములైన-కదలికలేని దేహేంద్రియమనః ప్రాణములు జన్మలేని ఆత్మవలె కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆబ్రహ్మను నేను అని తెలిసికొనుము. ఎవ్వడు వికారిగాక సాక్షియై స్వప్నమును, జాగరమును, సుషుప్తిని, వాటియొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలిసికొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలిసికొనుము. ఘటమును ప్రకాశింపచేయు దీపము ఎట్లు ఘటముకంటే భిన్నమో అట్లుగానే దేహాదులను బ్రకాశింపజేయు బోధరూపుడైన నేను ఆత్మ అని తెలిసికొనుము. ఎవ్వడు సర్వప్రియుడై నీయొక్క పుత్ర మిత్ర ప్రియప్రియాది భావములను ద్రష్టగా చూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలిసికొనుము. సాక్షియు బోధరూపుడగు వాడే నీవని యెరుగుము. సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును అవికారియగుట ఆత్మకే గలవు.దేహేంద్రియ మనః ప్రాణాహంకారములకంటే వేరయిన వాడును ౧. పుట్టుటా = జనిమత్వ, ౨. ఉండుట = అస్తిత్వం, ౩. వృద్ధిగతత్వ = పెరుగుట, ౪. పరిణామత్వ = పరిణామము చెందుట, ౫. కృశించుట, ౬. నశించుట ఈ ఆరు వికారములు లేనివాడు. వికారములు ఈ ఆరు భావాలు లేనిది బ్రహ్మ.
త్వం పదార్థమును ఇట్లునిశ్చయించుకొని వ్యాపించు స్వభావము చేత సాక్షాద్విధిముఖముగాను తచ్ఛబ్దార్థమును తెలిసికొనవలయును".

*శ్లో. అతద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విధిముఖేనచ!*
*వేదాంతానాం ప్రవృత్తిస్స్యాత్ ద్విరాచార్య సుభాషితమ్!!*

"తచ్ఛబ్దమునకు బ్రహ్మ అర్థము.ఆ తచ్ఛబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్ధము. వ్యావృత్తియనగా ఇదిగాదు ఇదిగాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలిది బ్రహ్మయని భావము. సాక్షాద్విధిముఖమనా సత్యం జ్ఞానమనంతంబ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్యజ్ఞానానంద స్వరూపుడని తెలిసికొనవలయును అని భావము. ఆత్మ సంసారలక్షణ విశిష్టముగాదనియు, సత్య స్వరూపనియు, దృష్టిగోచరముగా దనియు, తమస్సుకు పైదనియు అనుపమానంద రూపమనియు, సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియు, పరిపూర్ణమనియు చెప్పబడును. ఆ తద్వ్యావృత్తి రూపముగాను, సాక్షాద్విధిముఖముగాను తెలిసికొనదగిన ఆత్మస్వరూపము వేదములచేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు, సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో వాడే నేనని తెలిసికొనును. మృత్తికాది దృష్టాంతముల చేత ఏక వస్తుజ్ఞానము చేత సర్వవిజ్ఞానము దేనిచే కలుగునని శ్రుతులందు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలిసికొనుము. నేననునదియు బ్రహ్మయనునదియు ఒకే అర్థము కలిగినవి.
వేదములందు ఎవ్వనికి 'తదనుప్రవిశ్య'ఇత్యాది వాక్యములచేత జీవాత్మరూపముచేత ప్రాణులందు ప్రవేశమున్ను, ఆ జీవులను గురించి నియంతృత్వమున్ను చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము. వేదములందు ఎవ్వనికి కర్మఫలప్రదత్వము, జీవకారణకర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము. ఈప్రకారముగా "తత్, త్వం" అను పదములు రెండును నిశ్చయించబడివి.తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు, అనగా నీవె బ్రహ్మవని భావము చెప్పబడినది".

"ముందు వాక్యార్థమును చెప్పెదను. వాక్యార్థమనగా తత్త్వం పదములకు ఐక్యము = ఏకత్వము చెప్పబడును. ప్రత్యగాత్మయే అద్వయానందరూప పరమాత్మ. పరమాత్మయే ప్రత్యగాత్మ. ఈప్రకారముగా అన్యోన్యతాదాత్మ్యము ఎప్పుడు అనుభవమున గలుగునో అప్పుడే త్వం పదమునకు అర్ధము తెలియును. బ్రహ్మగాదను భ్రాంతి నశించును.తాదాత్మ్యమనగా అదియే ఇదియని అర్థము అనగా ఐక్యము. తత్త్వమసి అనగా తత్, త్వమ్, అసి, ఈవాక్యార్థమునకు తాదాత్మ్యము చెప్పవలెను. అప్పుడు వాచ్యార్థములయిన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ విశిష్టులయి జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములై జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించినయెడల తాదాత్మ్యము సిద్ధించును.ముఖ్యార్థముకు బాధగలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను”.

ఈ లక్షణావృత్తి మూడు విధములు.అందులో ఇచ్చట బాగ లక్షణను గ్రహించవలెను.అనగా, కొంత పదము విడిచి కొంతపదము స్వీకరించుట భాగలక్షణయనబడును.తత్త్వమసియందు సర్వజ్ఞత్వకించిజ్ఞత్వములను వదలి కేవల జ్ఞానాత్మత్వ మాత్రమునే గ్రహించినయెడల అభేదము సంభవించును.తత్=అది, త్వం-నీవు, అసి=అయితివి. అనగా నీవే బ్రహ్మవైతివని భావము. సో యందే వదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధచేయబడును. తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాల ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివైచిన దేవదత్తుడొక్కడే భాసించును.అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదలి కేవల జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాసించును.'నేను బ్రహ్మనూ అను వాక్యార్థ బోధ స్థిరపడువరకు శమదమాది సాధనములు చేయుచు శ్రవణమనననిదిధ్యాసలను ఆచరించవలెను.ఎప్పుడు శ్రుతిచేతను, గురుకటాక్షముచేతను తాదాత్మ్యబోధ స్థిరపడునో అప్పుడు సంసారమూలము నశించును. కొంతకాలము మాత్రము ప్రారబ్ధకర్మ అనుభవింపుచుండి ప్రారబ్ధక్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదమొంది నిరతిశయానందముతో ఉండును.కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను జేయవలెను. ఆకర్మవిధినంతయు గురువువలన దెలిసికొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగతపాపుడై తరువాత ఆపుణ్యముచేత మంచిజన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞానియై కర్మబంధమును తెంచుకొని మోక్షమొందుదువు. ఇందుకు సందేము లేదు"

*ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే సప్తదశాధ్యాయసమాప్తః*

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి


|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Click Below & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Karnati Vanitha Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP


Comments

Popular posts from this blog

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

Vasthu Tip (వాస్తు టిప్) 005

శ్రీ కేదారేశ్వర వ్రత కథ