శ్రీ కార్తీక పురాణము 16వ అధ్యాయము

                                         శ్రీ కార్తీక పురాణము 16 అధ్యాయము



 #స్తంభదీప_ప్రశంస 

వశిష్ఠుడు ఈ విధముగా చెప్పెను. 
#దామోదరునకు ప్రీతికరమైన ఈ #కార్తీకవ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకమొందును. #కార్తీకమాసము నెలరోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును. #కార్తీకమాస మందు నెలరోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరి సన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకొని వైకుంఠమునకు పోవును. కార్తీకమాసమందు పూర్ణిమనాడు సంతానమును గోరి సూర్యుని ఉద్దేశించి స్నానము, దానము చేయవలెను. అనగా అట్లు చేసిన యెడల సంతానము గలుగునని భావము.

కార్తీకమాసమందు హరిసన్నిధిలో టెంకాయ దానమును దక్షిణతాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు, రోగము ఉండదు, దుర్మరణము ఉండదు. కార్తీకమాసమందు పూర్ణిమనాడు హరి ఎదుట స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతియగును. వానికి గలిగెడి పుణ్యమును చెప్పుటకు నాతరముగాదు. కార్తీకమాసమందు పూర్ణిమరోజున స్తంభదీపమును జూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్లవలె నశించును.

#స్తంభదీపము
 ను శాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి పెట్టవలెను. శిలతోగాని, కర్రతో గాని స్తంభమును చేయించి దేవాలయము ఎదుట పాతిదానిపైన దీపమును బెట్టువాడు హరికి ప్రియుడగును. ఈ స్తంభవిషయమై పూర్వము ఒక కథ గలదు చెప్పెదను వినుము.

మతంగమహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది. అందొక విష్ణ్వాలయము గలదు. ఆ ఆలయము చుట్టును వనముండెను. కార్తీకవ్రత పరాయణులై మునీశ్వరులచ్చటికి వచ్చి విష్ణువును షోడశోపచారములతోను మాసమంతయును పూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించి, వ్రతములు చేసిరి. అందులో ఒక ముని ఇట్లు పలికెను.

"మునీశ్వరులారా! కార్తీకమాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోక నివాసియగును. కాబట్టి మనము ఆలయమున స్తంభదీపమును పెట్టుదము. కార్తీకపూర్ణిమయిన ఈదినము సాయంకాలము స్తంభదీప దానము హరికత్యంత ప్రియము. స్తంభమును చేయించి కార్తీకమాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దానియందు దీపమును పెట్టువారి పాపములు నశించి వైకుంఠలోకమును పొందెదరు".

వారందరు ఆమాటవిని స్తంభదీపమును సమర్పించుట యందు ప్రయత్నము చేసిరి. ఓరాజా! ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును చూచిరి. కార్తీకవ్రత సముత్సాహులైన వారందరు కలసి ఆ స్థాణువునందు శాలివ్రీహితిల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకొనుచుండిరి. ఆసమయమున దేవాలయము ఎదుట 'చట','చట' అనే శబ్దములు కలిగి స్తంభదీపము నశించి అందరు చూచుచుండగనే ఆ స్థాణువంతయు పగిలి భూమియందు పడెను.

అందులోనుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలెను. అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయము నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమొంది, "అయ్యో!అయ్యో" యని ధ్వనిచేయుచు ఒక పురుషునిచూసి ఇట్లనిరి.

"ఓయీ! నీవెవ్వడవు?ఏ దోషముచేత మొద్దుగా నున్నావు?ఆ విషయమునంతయు త్వరగా చెప్పుము".

"ఓ బ్రాహ్మణోత్తములారా!నేను పూర్వమందు బ్రాహ్మణుడను. రాజ్యమును పాలించువాడను, ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు గలిగియు దయాశూన్యుడనై దుష్ట వర్తనగల వాడనైతిని. నేను వేదశాస్త్రములను చదువలేదు. హరిచరిత్రను వినలేదు. తీర్థయాత్రకు పోలేదు. స్వల్పమైన దానము చేయలేదు. దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనమునందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయకాములు అగు బ్రాహ్మణులను నాముందు నీచాసనములందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండువాడును, వారికెన్నడును ఎదుర్కొని నమస్కారములు చేయలేదు. వారి ఇష్టార్థములను ఇవ్వలేదు. సర్వకాలమందు వారికెన్నడును ఏ దానమును ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానమివ్వక తప్పనియెడల ధనము లేకుండా ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి యుండలేదు. శాస్త్రశ్రవణ సత్స్వభావసంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించు వారు. అప్పుడు సరే ఇచ్చెదనని చెప్పుటయే గాని ఇవ్వలేదు”.

నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును బుచ్చుకొని స్వకార్యములను చేసికొనువాడను. మరల వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండెడివాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆ దుష్కృత కర్మచేత చచ్చి నరకమందనేక యాతనలను అనుభవించితిని. తరువాత భూమికి వచ్చి ఏబది రెండువేల మారులు కుక్కగా జన్మించితిని. అనంతరము పదివేల మారులు కాకిగా పుట్టితిని. పదివేల మారులు తొండగా జన్మించితిని. పిమ్మట పదివేల మారులు పురుగుగా నుండి మలాశినైయుంటిని. ఆ తరువాత కోటి మారులు వృక్షముగా ఉండి స్థాణువుగా కాలము గడుపుచుంటిని. ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదు గాన సర్వభూత దయావంతులగు మీరు చెప్పుదురు గాక. మీదర్శనము వలన నాకు జాతిస్మృతి గలిగినది. ఓ మునీశ్వరులారా! నా పూర్వపాపమిట్టిది" అని ఆ అద్భుత పురుషుడు పలికెను.

మునీశ్వరులిట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకొనసాగిరి.

కార్తీకమాసఫలము యథార్థమయినది. ప్రత్యక్ష మోక్షమిచ్చునది. రాతికి, కొయ్యకు గూడ మోక్షమిచ్చినది. ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపచేయును. ఆ పూర్ణిమయందును స్తంభదీపము చాలా సుఖప్రదము. కార్తీకపూర్ణిమనాడు పరులచే ఉంచబడిన దీపమువలన ఎండిన మొద్దు ముక్తినొందెను. మొద్దయినను కార్తీకమాసమందు దేవసన్నిధిలో దీపమును పెట్టినయెడల పాపమునశించి దయాళువయిన దామోదరుని చేత మోక్షమొందించబడినది”.

ఇట్లు వాదమును చేయి వారితో అద్భుత పురుషుడు తిరిగి ఇట్లనియె.

"జ్ఞానవేత్తలయిన మునీశ్వరులారా! దేనిచేత మోక్షము కలుగును? దేనిచేత బద్ధుడగును? దేనిచేత ముక్తుడగును? దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు గలుగును? మోక్షప్రాపకమైన జ్ఞానమెట్లుగలుగును? ఈ సర్వమును నాకు చెప్పుము" అని అడగగా, మునీశ్వరులు అంగీరసమునిని వానికి సమాధానము చెప్పుమని నియోగించిరి. ఆయన వారితో సరేనని ఇట్లు చెప్పసాగెను.

*ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షోడశాధ్యాయసమాప్తః*


సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి


|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Click Below & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Karnati Vanitha Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP


Comments

Popular posts from this blog

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

Vasthu Tip (వాస్తు టిప్) 005

శ్రీ కేదారేశ్వర వ్రత కథ