శ్రీ కార్తీక పురాణము 15వ అధ్యాయము

                                           శ్రీ కార్తీక పురాణము 15 అధ్యాయము


#దీప_ప్రజ్వలనముచే_ఎలుక_పూర్వజన్మస్మృతితో_నరరూపమందుట 

ఓ జనకమహారాజా! తిరిగి కార్తీక మహాత్మ్యమును జెప్పెదను.భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును. పుణ్యము గలుగును. 
#కార్తీకమాస మందు హరిముందర నాట్యము చేయువాడు విగతపాపుడై హరిమందిర నివాసి యగును. #ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకుబోయి సుఖించును. కార్తీకమాసమున శుక్ల పక్షమందు సాయంకాలమందు హరిని బూజించువాడు స్వర్గాధిపతియగును. కార్తీకమాసమందు నెల రోజులు నియతుగా విష్ణ్వాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును పొందును. సందేహము లేదు. ఈమాసమందు హరి సన్నిధికిబోయి హరిని దర్శించువాడు విష్ణుసాలోక్యముక్తిని బొందును. కార్తీకమాసమందు విష్ణ్వాలయ దర్శనార్థము వెళ్ళనివాడు రౌరవనరకమును, కాలసూత్ర నరకమును పొందును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కనుక ఆరోజున పూజ చేసిన పుణ్యమునకు అంతములేదు.

ద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడిభక్తితో హరిని గంధములతోను, పుష్పములతోను, అక్షతలతోను, దూపముతోను, దీపముోను, ఆజ్యభక్ష్యనైవేద్యములతోను బూజించువాని పుణ్యమునకు మితిలేదు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు విష్ణ్వాలయమునందుగాని, శివాలయమునందుగాని లక్షదీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవ బృందముచేత కొనియాడబడుచు విష్ణులోకమునకు జేరి సుఖించును.

కార్తీకమాసము నెల రోజులు దీపమును బెట్టలేనివాడు శుద్ధద్వాదశినాడును, చతుర్దశినాడును, పూర్ణిమనాడును మూడు రోజులు పెట్టవలెను. కార్తీకమాసమందు దేవసన్నిధిలో ఆవుపాలు పితుకునంత కాలము దీపమునుంచిన యెడల పుణ్యవంతుడగును. కార్తీకమాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగుచేసి వెలిగించి వాడు పాపములేని వాడు అగును. కార్తీకమాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములయిన పాపములను నశింపజేసికొనును. ఈవిషయమందొక పూర్వపు కథ గలదు. విన్నంతనే పాపములు నశించును. సావధానముగా వినుము.

పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టిమొదలు పూజానైవేద్యములు లేక జీర్ణమైన విష్ణ్వాలయమొకటిగలదు. కార్తీకస్నానార్ధము కర్మనిష్ఠుడను నొక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరమునకు వచ్చెను. సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని యెంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకుబోయి నూనెదెచ్చి పండ్రెండు దీపపాత్రలను దెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను. యతీశ్వరుడిట్లు చేయుచుండగా కార్తిక శుద్ధ ద్వాదశినాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము జేసి మెల్లగా దీపముల సన్నిధికి జేరెను. ఎలుక వచ్చినతోడనే జ్వాల తగ్గిపోయి కేవలము వత్తితో గూడియున్న పాత్రను జూసి దాని దగ్గరను జ్వాలతో గూడిన వర్తిని జూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసికొని జ్వాలలేని వర్తిని గూడ గ్రహించెు. అంతలో జ్వాలతో యున్న వర్తి సంపర్కము వలన జ్వాలలేని వర్తియు మండెను. రెండును వెలుగగా వేడిచేత నూనె త్రాగుటకు వీలులేక విడిచెను. కార్తిక శుద్ధ ద్వాదశినాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని యెలుక తిరిగి వెలిగించినది. తరువాత పూర్వ పుణ్యవశము చేత ఆరాత్రియే అచ్చటనే మృతినొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారియాయెను. అంతలోనే యతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుని జూచెను. చూచి నీవెవ్వడవు. ఇచ్చటికెందుకు వచ్చితివి అని యడిగెను. ఆమాటవిని ఉద్భూతపురుషుడు తిరిగి యతితో ఇట్లనియె. పాపరహితా! నేను ఎలుకను. గడ్డిలో గింజలను భక్షించుదానను. నిత్యము ఈదేవాలయమందుండు దానను. ఎలుకనై యున్న నాకిపుడు దుర్లభమైన మోక్షము సంభవించినది. ఇది యే పుణ్యముచేత గలిగినదో నాకు తెలియదు. పూర్వమందు నేనెవ్వడను? ఏమి పాపమును జేసితిని? ఏపాపము చేత ఈమూషకత్వము నాకు ప్రాప్తించినది? ఈవిషయమంతయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగియున్నారు. మీకు నేను దాసుడను. శిష్యుడను. దయకు పాత్రుడను. ఆమాటవిని యతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉద్భూతపురుషునితో ఇట్లని చెప్పదొడగెను. యతి ఇట్లనెను.

ఓయీ! నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు. బ్రాహ్మణుడవు. నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు. బాహ్లికుడను పేరు గలవాడవు. స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును జేయుచు వివేకములేక బ్రాహ్మణులను నిందించెడివాడవు. దేవపూజలను వదలి నిత్యము శ్రాద్ధ భోజనమును దినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రింబగళ్ళు భుజించుచున్నవాడవు. స్నాన సంధ్యావందన తపస్సులను జేయువారిని చూచి నవ్వుచు నిందించువాడవు. నీకు సుందరియైన భార్యయుండెడిది. ఆమెకు సహాయము కొరకు నిరంతరము శూద్రస్త్రీని ఇంటివద్ద పనులకు ఉంచుకుని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దానిచేత అన్నమును బెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు, పాలు, నెయ్యి అమ్ముకొనియు ధనార్జనపరుడవై యుంటివి. ఈప్రకారముగా బహు ద్రవ్యమును సంపాదించి ఆద్రవ్మును భూమియందు దాచి చివర మృతినొందితివి. ఇట్టి పాతకములచేత నరకమనుభవించి తిరిగి భూమియందు మూషకముగా జన్మించి ఈదేవాలయమందుండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి. దైవవశమువలన ఈదినమందు నాచేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి.గనుక ఆపుణ్యముచేత మూషకత్వము పోయి దివ్య రూపము గలిగినది. ఇక హరభక్తి గలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉందువు.

ఈప్రకారముగా యతిచెప్పిన మాటను విని ఉద్భూతపురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞతీసుకొని పాపములను నశింపజేయు సరస్వతీ నదికిబోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ యీ మూడు దినములందు స్నానము చేసి ఆమహిమచేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును జేసి తన్మహిమవలన అంతమందు సాయుజ్యముక్తిబొందెను. కాబట్టి కార్తీకశుద్ధి ద్వాదశినాడు భగవత్పరాణుడై పాపముక్తుడై సాయుజ్యపదము పొందును.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే పంచదశాధ్యాయస్సమాప్తః

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి


|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Click Below & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Karnati Vanitha Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP


Comments

Popular posts from this blog

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

Vasthu Tip (వాస్తు టిప్) 005

శ్రీ కేదారేశ్వర వ్రత కథ