శ్రీ కార్తీక పురాణము 11వ అధ్యాయము

                                         శ్రీ కార్తీక పురాణము 11 అధ్యాయము


 #మంథరుడు_పురాణమహిమ 

రాజోత్తమా! తిరిగి చెప్పెదను వినుము. 
#కార్తీకమాస మందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణ వ్రత ఫలము పొందును. కార్తీకమాస మందు గరికతోను, కుశలతోను హరిని పూజించువాడు పాపవిముక్తుడై వైకుంఠమును చేరును.

కార్తీకమాసమందు చిత్రమైనరంగులతో గూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షము నొందును.కార్తీకమాస మందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలను ఉంచువాడును, పురాణమును చెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నియును నశింపజేసుకొని పరమపదమును పొందుదురు. ఈవిషయమై ఒక పూర్వకథ గలదు. అది విన్నమాత్రముననే పాపములు పోవును. ఆయురారోగ్యములను ఇచ్చును. దానిని చెప్పెద వినుము.

కళింగదేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచి పెట్టినవాడై ఇతరులకు కూలి చేయుచుండెడివాడు. అతనికి మంచిగుణములు గలిగి సుశీలయను పేరుగల భార్య ఉండెను. ఆమె పతివ్రతయు, సమస్త సాముద్రిక లక్షణములతో గూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను.

ఓ రాజా! ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతనియందు ద్వేషము ఉంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలిజీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని ఉండి దారి నడుచువారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలమును గడిపెను. అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను.

ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టి యుండి మార్గమున వచ్చునొక బ్రాహ్మణుని పట్టుకొని మర్రిచెట్టుకు కట్టి అతని సొమ్మంతయును అంతా హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతుడొకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను.

తరువాత గుహలో నున్న పెద్దపులి కిరాత మనుష్య గంథమును ఆఘ్రాణించి వచ్చి వానిని కొట్టెను. కిరాతుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారములచేత ఒక్కమారే చనిపోయిరి.

ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒక చోట మృతినొంది యమలోకమునకు బోయి కాలసూత్ర నరకమందు యాతన బడిరి.

యమభటులు వారినందరిని పురుగులతోను, అమేధ్యముతోను కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలకాగుచున్న రక్తమందు బడవైచిరి.

జనకమహారాజా! ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను.

ఓరాజా! ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామము చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు, సమస్త వస్తువులందు హరిని దర్శించుచు, ఆనంద భాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చెను.

ఆమెయు ఆ యతిని జూచి భిక్షమిడి అయ్యా యతిపుంగవా! మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించితిని. మీవంటివారి దర్శనము దుర్లభము. మాయింటివద్ద నా భర్త లేడు. నేనొక్కదాననే పతిధ్యానమును చేయుచున్నదానను.

ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణియు శ్యామయునయిన ఆమెతో అమ్మాయీ! ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము. ఈదిన సాయంకాలము హరిసన్నిధిలో ఈ ఇంటిలో పురాణ పఠనము జరుపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె తెచ్చెదను. గనుక వత్తి నీవు చేసి ఇమ్ము. శ్యామయనగా యౌవనవతియని అర్థము.

యతీశ్వరుడిట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయముతెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై, అందు అయిదురంగులతో ముగ్గులను పెట్టి, పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై, ఆ దూదిచే రెండు వత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను.

ఆ చిన్నది దీపపాత్రను, వత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆ దీపమునందు హరిని పూజించి మనశ్శుద్ధి కొరకై పురాణపఠనము ప్రారంభించెను. ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణశ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్రమనస్సుతో పురాణమును వినెను.

తరువాత యతీశ్వరుడు యధేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతినొందెను. అంతలో శంఖచక్రాంకితులును, చతుర్బాహులును, పద్మాక్షులును, పీతాంబరధారులునునైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోను, ముత్యాలతోను, పగడములతోను, రచించిన మాలికలతోను, వస్త్రములతోను, ఆభరణములతోను అలంకరించబడిన విమానమును దీసికొని వచ్చి సూర్యుడువలె ప్రకాశించెడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయజయ ధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను.

ఆమె వైకుంఠమునకు పోవుచు మధ్యమార్గమందు నరకమును జూచి, అచ్చట తన పతి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యమొంది విష్ణుదూతలతోనిట్లు పలికెను.

ఓ విష్ణుదూతలారా! నిమిషమాత్రము ఉండండి.ఈ నరకకూపమునందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఈవిషయమును నాకు చెప్పుడు.

వీడు నీభర్త, వీడు కూలిచేసియు, దొంగతనమును చేసియు పరధనాపహరణము చేసినాడు.వేదోక్తమయిన ఆచారమును వదలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు.ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు, ఇతడు బాల్యమునుండి మిత్రుడైయున్న వాని నొకనిని చంపి వాని ధనము అపహరించి ఇతరదేశమునకు బోవుచున్నంతలో నీభర్తచేత హతుడాయెను.అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు బడియున్నాడు. ఈమూడవవాడు కిరాతుడు. వీడు నీభర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను.ఈ నాల్గవవాడు, పులి, కిరాతులు పరస్పర ఘాతములచేత మృతినొందిరి.

ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశినాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలనొందుచున్నారు. ద్వాదశినాడు నేయి వాడవలెను. నూనె వాడకూడదు.

విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా! ఏపుణ్యము చేత వీరు నరకమునుండి ముక్తులగుదురని యడిగెను. ఆమాటవిని దూతలిట్లనిరి. అమ్మా! కార్తీకమాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణఫలమును నీభర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును.

ఆ పురాణశ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాతవ్యాఘ్రములకు సమానముగా ఇమ్ము. దానివలన వారు ముక్తులగుదురు. పురాణశ్రవణార్థమై నీవు ప్రతిగృహమునకు వెళ్ళి ప్రజలను బిలిచిన పుణ్యమును ఈకృతఘ్నునకు ఇమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానములచేత వారు వారు ముక్తులగుదురు.

విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యమొంది బ్రాహ్మణస్త్రీ ఆయా పుణ్యములను వారి వారికిచ్చెను. దానిచేత వారు నరకమునుండి విడుదలయై దివ్యమానములను ఎక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందెడి ముక్తిపదమును గూర్చి వెళ్ళిరి.

కార్తీకమాసమందు పురాణశ్రవణమును చేయువాడు హరిలోకమందుండును. ఈ చరిత్రను వినువారు మనోవాక్కాయముల చేత సంపాదించబడిన పాపమును నశింపచేసుకొని మోక్షమును పొందుదురు.

*ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ఏకాదశోధ్యాసమాప్తః*

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి


|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Click Below & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Karnati Vanitha Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP


Comments

Popular posts from this blog

రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి?

Vasthu Tip (వాస్తు టిప్) 005

శ్రీ కేదారేశ్వర వ్రత కథ